Varudu Kalyani: నాగాంజలి మృతి బాధాకరం 7 d ago

AP: ఫార్మసీ విద్యార్థినీ నాగాంజలి మృతి బాధాకరమన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. సూసైడ్‌నోట్ రాసి 12 రోజులుగా మృత్యువుతో పోరాడి చివరికి మరణించినా ఈ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇప్పటికీ ఈ ఘటనపై సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. పోలవరం పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు.. నాగాంజలిని పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తాట తీస్తా అన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీపక్‌పై ఏలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. నాగాంజలికి అందుతున్న వైద్యంపై హోం మంత్రి అనిత ఆలోచన చేశారా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలు ప్రశాంతంగా ఉన్నారా అని ప్రశ్నించారు. కూటమి నాయకులకు కామెడీ స్కిట్స్‌పై ఉన్న శ్రద్ధ.. ఆడపిల్లల రక్షణపై లేదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను మహిళలు, ప్రజల రక్షణ కోసం ఉపయోగించడం లేదన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిపక్ష నాయకులపై ఎలా కక్ష సాధించాలనే చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ఆడపిల్లల తల్లిదండ్రులు బయటకు పంపాలంటే భయపడుతున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి టీమ్ ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. నిందితులు టీడీపీకి చెందిన వారైతే చర్యలు తీసుకోవడం లేదని, ఈ యాప్ సరిగ్గా పని చేస్తే మహిళలకు ఇలాంటి దుస్థితి రాదని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్ తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై చులకన భావం ఉందని పేర్కొన్నారు